కలం, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నేడు నిర్వహించిన సమావేశంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ స్వార్థం కోసం రేవంత్ రెడ్డి పంచన చేరారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లిపోయినా, పార్టీకి వెన్నెముక లాంటి కేడర్ మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావోస్తుందని, ఇంకా రెండేళ్ల పాలన మాత్రమే మిగిలి ఉందని కేటీఆర్ తెలిపారు. అయితే బీఆర్‌ఎస్‌కు పోయింది కేవలం అధికారం మాత్రమేనని, కానీ కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న అభిమానం ఎక్కడా తగ్గలేదని పేర్కొన్నారు. పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ పాటలు పెట్టొద్దని చెప్పారని.. అయినప్పటికీ కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ప్రజలు గణేష్ నిమజ్జనంలో సజ్జనార్, కిషన్ రెడ్డి ముందే దేఖ్ లేంగే పాటకు స్టెప్పులు వేశారని గుర్తు చేశారు. ఇదంతా చూస్తూ గత 15 రోజులుగా ముఖ్యమంత్రికి నిద్రపట్టడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ప్రస్తుతం లుచ్చా పనులు చేస్తూ, నాగుపాముల్లా బుసలు కొడుతున్న వానపాములను, అక్రమార్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు.
ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డు లేదు
రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీ రాబోదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ లేదు.. గాడిద గుడ్డు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఉన్న సిటీని పట్టించుకోండి అంటే లేని ఫ్యూచర్ సిటీ గురించి పెద్ద పెద్ద డైలాగులు బాదుతున్నారని మండిపడ్డారు. ఉన్న సిటీలో దోమల బెడదతో జనాలు ఇబ్బంది పడుతుంటే.. లేని ఫ్యూచర్ సిటీ గురించి సినిమాలు చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా అది ఫ్యూచర్ సిటీ కాదు.. హైదరాబాద్ ఫార్మా సిటీ అని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఎవరూ పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ టెండర్లు పూర్తయ్యాయని, అది పూర్తయి ఉంటే రాయదుర్గం – శంషాబాద్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తీరిపోయేవని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 57, 58 జీవోల ద్వారా పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయడమే కాకుండా, హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మూసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. నీటి వనరులు ఉన్నప్పటికీ సక్రమంగా నీళ్లు ఇవ్వడం లేదని, 30 శాతం కమీషన్ల సంస్కృతితో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు.

