కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్, బీజేపీ నాయకుల వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఒక బౌన్సర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమిత్ షా నడుస్తుంటే ముందుకెళ్లి అందరినీ పక్కకు జరపడం ఏంటని ప్రశ్నించారు. “మీరు కేంద్రమంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి” అని హితవు పలికారు. ఢిల్లీ పర్యటనల్లో అమిత్ షా చేతులు ఊపుకుంటూ వెళ్లిపోవడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఖరిని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ దగ్గరకు వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా పక్కకు నెట్టేస్తున్నారని, అయినా సిగ్గులేకుండా వారి వెనుకాలే తిరుగుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించేస్తున్నారన్నారు.
మియాపూర్ భూముల (Miyapur Lands) విక్రయం అంశంపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే మియాపూర్ భూములు కబ్జాకు గురయ్యాయని, తాము ప్రముఖ న్యాయవాదిని పెట్టి వాదించడం వల్లే ఇటీవలే సుప్రీంకోర్టు ఆ 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. తీర్పు రాగానే ఆ భూములను అమ్మేస్తానని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి హిల్ట్ పీ స్కాంలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు భూములు కొంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
మియాపూర్లో వచ్చిన 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించడానికి బదులు ప్రజోపయోగ పనులకు కేటాయించాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. అందులో 200 ఎకరాలు పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం, 100 ఎకరాలు అమరవీరుల కుటుంబాలకు, మరొక 100 ఎకరాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని సూచించారు. మిగిలిన భూమిలో పిల్లలకు అవసరమైన స్కూళ్లు, కాలేజీలు నిర్మిస్తే తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలోనే తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ప్రస్తుతం జరుగుతున్న భూదందాలన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు.
Also Read : గాంధీ భవన్కు ఆ ఇద్దరు.. పీసీసీ కీలక ఆదేశాలు!
Follow Us On : WhatsApp

