కలం, నేరడిగొండ: నేరడిగొండ మండలం బోరిగాం (Borigam) గ్రామంలో బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) పర్యటించారు. రూ.3 కోట్లతో గుట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను ప్రారంభించారు. అలాగే రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, మరో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో జగదాంబ దేవి ఆలయానికి ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలోకి వర్షపు నీరు చేరకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్న నేపథ్యంలో గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.
మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉండాలని, చిన్నచిన్న వివాదాలకు తావివ్వకుండా కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, ఉప సర్పంచ్ సంగీత బాయి, మాజీ సర్పంచ్ పవన్, నాయకులు పండరి, రవీందర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్, జీవన్, రాథోడ్ సురేందర్, భూషణ్, మెర్సింగ్, మున్నా నాయక్, చరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

