కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించేలా కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెనుకాల సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులు పరుగులు తీయడాన్ని తప్పుబట్టారు. మీరు ఆయనకు బాడీగార్డులా..? అని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు ఆయన చెప్పులు మోస్తూ, కాళ్లు మొక్కుతూ బీజేపీ నాయకులు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజలు ఇచ్చిన పదవుల గౌరవాన్ని రెండు పార్టీల నాయకులు మంటగలుపుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదేం ప్రవర్తన అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవమే ప్రధాన ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రమని.. రెండు జాతీయ పార్టీలకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే, శనివారం రాహుల్ గాంధీ బైక్ వెనుకాల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొద్దిసేపు పరుగెత్తారు. తన బైక్ స్కిడ్ అయిందని, రాహుల్ గాంధీ పిలవడంతోనే వేగంగా పరుగెత్తుకు వెళ్లానని ఆయన క్లారిటీ ఇచ్చారు.

