కలం, వెబ్ డెస్క్ : సిరిసిల్ల (Sircilla) మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం మరియు వివక్షా పూరిత వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) గారికి అత్యంత ఘాటుగా లేఖ రాశారు.
సిరిసిల్లలో ‘మెగా పవర్‌లూమ్ క్లస్టర్’ (Mega Powerloom Cluster) ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సిరిసిల్ల శాసన సభ్యుడిగా పూర్వపు టెక్స్‌టైల్ శాఖా మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు మరియు అధికారిక విజ్ఞప్తులు ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటువంటి సానుకూల నిర్ణయానికి నోచుకోకపోవడం అన్యాయమని అన్నారు.
సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం గత పదేళ్లలో సుమారు పది సార్లు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్ కోసం నివేదికలు, వినతులు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ గారు, స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బ్రతిమిలాడాం, CPCDS నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధృవీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటి ? తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష? అని ఆయన (KTR) ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని ధ్వజమెత్తారు.
Read Also: ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: X(Twitter)


