కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్లాన్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
2500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.35 కోట్ల 75 లక్షలతో చేపట్టిన కొదుమూరు-వందనం ఎత్తిపోతల రెండో విడత పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వందనం గ్రామంలో ఎస్సీ కాలనీలో కోటి 85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి వందనం పుట్టకోట జడ్పీ రోడ్డు వరకు రూ.3 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొదుమూరు – వందనం లిఫ్ట్ పనులు 2013లో పూర్తి చేసి 2500 ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు. చింతకాని మండలం చుట్టు నాగార్జున సాగర్ నీళ్ళు ఉన్నప్పటికీ కొదుమూరు, వందనం రైతులు సాగు నీరు అందక ఇబ్బందులు పడ్డారని, వీరి ఆవేదన పరిశీలించి 2009లో ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో మొదటి విడత లిఫ్ట్ పూర్తి చేశామని అన్నారు.
కొదుమూరు వందనం లిఫ్ట్ కారణంగా ఎండాకాలంలో కూడా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం లిఫ్ట్ రెండవ ఫేజ్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను 22 వేల 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసామని తెలిపారు. మున్నేరు పాలేరు లింకు కెనాల్ ద్వారా లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జవహర్ లిఫ్ట్ క్రింద 33 వేల 25 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొదుమూరు వందనం లిఫ్ట్ ద్వారా 2500 ఎకరాలు, మంచుకొండ లిఫ్ట్ ద్వారా 2412 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం.
వ్యవసాయ రంగంపై గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం 74 వేల 163 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు. మధిర అసెంబ్లీలోని 5 మండలాల పరిధిలో కట్టలేరు, మున్నేరు, వైరా నది జలాలు వృథాగా పోకుండా ఆనకట్టలు కట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మహిళలకు రూ.5 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పుకొచ్చారు.

Read Also: కేసీఆర్ ఫోటోపై తెలంగాణ జాగృతిలో చర్చ
Follow Us On: X(Twitter)


