కలం, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలు గర్వకారణంగా భావించే ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) ఏర్పాటై రేపటితో వందేళ్లు పూర్తి కాబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయం ఉండాలనే డిమాండ్లు అధికంగా రావడంతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1926 ఏప్రిల్ 26న విజయవాడలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. 1930లో విశాఖకు తరలించి.. 1931 నుంచి ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ లో తెలుగు, పొలిటికల్ సైన్స్ వంటి కీలక కోర్సులు ప్రారంభించారు. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సువిశాల క్యాంపస్ లో చదువుకోవడం విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు మాత్రమే.. గర్వకారణంగా నిలుస్తుంటుంది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కళాశాల కూడా ఉండటం గమనార్హం. ఏయూకి అనుబంధంగా 300 కాలేజీలు ఉండగా.. వీటిలో విద్యార్థుల సంఖ్య లక్షకు పైగానే ఉంటుందని రికార్డులు చెబుతున్నాయి.
ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే..
సర్ కట్టమంచి రామలింగారెడ్డి ఏయూ స్థాపకుల్లో ఒకరు. ఇక మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్స్ లర్ గా పనిచేశాకే.. అత్యున్నత పదవిలోకి వెళ్లారు. ఆయన ఇక్కడ ఫిలాసఫీ బోధించేవారు. ప్రఖ్యాత ఫిజిక్స్ సైంటిస్ట్ అయిన సర్ సీవీ. రామన్ కొంతకాలం ఇక్కడే విద్యార్థులకు చదువు చెప్పారు. విశిష్ట శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సీ.ఆర్.రావ్, సూరి భగవంతం, ప్రొఫెసర్ సి.ఆర్.రామచంద్రరావు, టీ.ఆర్.శేషాద్రితో పాటు వేలాది మంది న్యాయవాదులు, జడ్జిలు, ఇంజినీరింగ్ నిపుణులు ఇక్కడ చదువుకున్నవారే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచి, ప్రపంచానికి మేధావులను అందించిన ఈ యూనివర్సిటీ (Andhra University) శతాబ్ధి వేడుకలకు రేపు ఉప రాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు.
Read Also: మంగళసూత్రాలు, బొట్టు ధరిస్తే సస్పెండ్ చేస్తాం.. డీజీపీ ఉత్తర్వులు
Follow Us On : WhatsApp

