కలం, వెబ్ డెస్క్: KTR- Kavitha | కవిత కొత్త పార్టీ TRSపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలి సారి స్పందించారు. ‘రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరిట కొత్త పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత.. కేసీఆర్ తో పాటు కేటీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజా వ్యాఖ్యల ద్వారా.. ఆమె పార్టీని బీఆర్ఎస్ అధిష్ఠానం పెద్దగా సీరియస్ గా పట్టించున్నట్లు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కవిత విషయంలో తొలి నుంచి వ్యూహాత్మకంగానే..
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడంపై బీఆర్ఎస్ అగ్ర నేతలు పైకి పెద్దగా స్పందించకపోయినా.. అంతర్గతంగా ఆరా తీస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కామెంట్స్ కి రియాక్ట్ అవుతుంటే అనవసరంగా హైలైట్ చేసినట్టు అవుతుందనే ఆలోచనతో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, తనతో గులాబీ పార్టీలో చాలా మంది టచ్ లో ఉన్నారని కవిత పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నిజంగా కవితతో ఎవరైనా సంప్రదింపులు చేస్తున్నారా.. లేకపోతే, బీఆర్ఎస్ పార్టీలో గందరగోళపరిచాలనేదే ఆమె వ్యూహమా.. అనేది కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా, కవిత కొత్త పార్టీ రాకతో అన్ని పార్టీల కంటే, బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ ప్రభావితం కాబోతుందనేది పొలిటికల్ పండిట్స్ మాట.

