కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా జర్నలిస్టుల చిరకాల ఆకాంక్ష త్వరలో సాకారం కానుంది. జిల్లా కేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్ క్లబ్ (Press Club) భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) నుంచి రూ.20 లక్షలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి పర్యటన సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు శాశ్వత వేదికగా నిలిచేలా సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్ క్లబ్‌ను నిర్మించాలని కోరారు.
జర్నలిస్టుల విజ్ఞప్తిపై మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు. ఈ మేరకు Proceedings No: DySO1/05/SDF (DIM)/WNP AC/2023-24 ప్రకారం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత జర్నలిస్టుల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడనుంది. అలాగే ప్రజలు–మీడియా మధ్య సమర్థవంతమైన సమాచార వేదికగా కూడా నిలవనుంది. జర్నలిస్టుల కోరికను వెంటనే నెరవేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, మీడియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

