కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) అనేది కేవలం రాజకీయ పార్టీ కాదని, ఇది ఒక విప్లవం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ అంటే నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అని పేర్కొన్నారు. తమ పార్టీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నదని వెల్లడించారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ .. సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకను జరుపుకుంటున్నామని చెప్పారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించడం ఒక మహోజ్వల లాంగ్ మార్చ్ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

