మూకుమ్మడి దాడి.. అయినా TRS లో సోలో వాయిస్

కలం, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పేరుతో కవిత (Kavitha) రాజకీయ పార్టీని స్థాపించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఘాటుగానే రియాక్ట్ అయ్యాయి. తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు లేని రియలైజేషన్ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతనే కనువిప్పు కలిగిందా అంటూ

ఆమె తీరును తప్పుపడుతున్నారు. బీసీ నినాదాన్ని భుజానికెత్తుకున్న కవిత సీఎం అవుతానంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారే తప్ప బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నరంటూ బీసీ సంఘాలూ మండిపడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో ఈ స్థాయికి ఎదిగిన కవిత ఇప్పుడు ఆయననే తప్పుపట్టడం సూర్యుడి మీద ఉమ్మేయడమేనని బీఆర్ఎస్ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. అన్ని పార్టీల నుంచి కవితకు స్ట్రాంగ్ రియాక్షన్స్ రావడంతో స్వయంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్తగా పెట్టిన పార్టీ కావడంతో సెకండ్ ర్యాంక్ లీడర్లు లేరు.. అధికార ప్రతినిధులూ లేరు.. ఏక్ నిరంజన్ తరహాలో అన్నింటికీ ఆమె మాత్రమే క్లారిటీ, కౌంటర్ ఇవ్వక తప్పడంలేదు.

కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్‌షిప్ గ్రీన్ సిగ్నల్ ? :

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీ నాయకత్వంపైనా, వ్యక్తిగతంగా హరీశ్‌రావు లాంటివారిపైనా తీవ్ర స్థాయిలో కవిత విమర్శలు చేశారు. కానీ వాటికి పార్టీ తరఫున లేదా వ్యక్తులుగా విమర్శలు ఎదుర్కొన్నవారైనా కౌంటర్ ఇవ్వలేదు. పార్టీ అధినేత కుమార్తె కావడంతో కౌంటర్ ఇస్తే ఇబ్బందులు వస్తాయేమోనని తటపటాయించారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా ఎవ్వరూ కవితకు కౌంటర్ ఇవ్వలేదు. దీంతో కిందిస్థాయి బీఆర్ఎస్ లీడర్లు కూడా సాహసించలేదు. మధ్యలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎపిసోడ్‌తో గులాబీ నేతలలెవ్వరూ కవితను విమర్శించే సాహసం చేయలేదు. కొత్త పార్టీ పెడుతున్న సందర్భంగా నేరుగా కేసీఆర్‌నే కవిత టార్గెట్ చేయడంతో ఒక్కరొక్కరుగా నోరు విప్పుతున్నారు. నిన్నమొన్న చేరిన జీవన్‌రెడ్డి మొదలు బాల్క సుమన్ వరకు చాలా మంది రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా కవిత మీద ఘాటుగానే స్పందించారు. పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కవితపై కౌంటర్లు స్టార్ట్ అయ్యాయని, ఇకపైన ఉపేక్షించే అవకాశాలు ఉండవన్న మాటలు గులాబీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

సీఎం రేవంత్‌పై విమర్శలకు కాంగ్రెస్ లీడర్ల కౌంటర్ :

కొత్త పార్టీని పెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కర్కోటకుడు, రాష్ట్రంలో హిట్లర్ పాలన అంటూ కవిత చేసిన కామెంట్లను కాంగ్రెస్ లీడర్లు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి కవితకు లేదని, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఆ మాటలను వెనక్కి తీసుకున్న తర్వాతనే ఆమె ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కొత్త పార్టీ పెట్టుకునే హక్కు ఆమెకు ఉన్నదని, తండ్రీ కూతురు మధ్య ఉన్న విభేదాలతో వారిద్దరూ ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎలా తిట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మాత్రం ఆమెకు లేదన్నారు. పదేండ్ల పాటు కీలక పదవులు అనుభవించిన ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, తీహార్ జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

అప్పుడు కేఏ పాల్ కూడా పార్టీ పెట్టుకున్నారు : బీజేపీ స్టేట్ చీఫ్

తెలంగాణలో గతంలో కేఏ పాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టుకున్నారని, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా పెట్టుకున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమన్నారు. ఎవరు పార్టీ పెట్టుకున్నా ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నదనేదే ముఖ్యమన్నారు. “గతంలో టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌.. ఈ పార్టీకి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్‌ఎస్‌ అట.. వీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప చేస్తున్నదేమిటి?” అని అన్నారు. కేసీఆర్‌ది పిట్టలదొర పాత్ర అయితే, కల్వకుంట్ల కవితది పిట్టల దొరసాని పాత్ర ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇప్పటికే తనదైన శైలిలో సెటైర్ వేశారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం కాకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని, విచారణ సంస్థలు చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నాయని, ఈ వ్యవహారంతో తెలంగాణ పరువును ఢిల్లీ వీధుల్లో పడిందని విమర్శించారు. విచారణను ఎదుర్కోలేకనే సెంటిమెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>