కలం, కరీంనగర్ బ్యూరో: ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల (Jagtial) జిల్లా ఎండపల్లి మండల BRS పార్టీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబాన్ని BRS పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో పార్టీ నాయకులు కేటీఆర్‌ను కలిసి, జగన్ ఆత్మహత్యకు గల కారణాలను, వారి కుటుంబ పరిస్థితిని వివరించారు.
కార్యకర్త కుటుంబానికి అండగా కేటీఆర్
కార్యకర్త కుటుంబ పరిస్థితిపై వెంటనే స్పందించిన కేటీఆర్, BRS పార్టీ తరఫున రూ. 10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, పార్టీ ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కార్యకర్తలు ఎవరూ కూడా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు మండల నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలందర్ రెడ్డి, కల్వల గంగాధర్ రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్ గౌడ్, మాధవరావు, సందీప్, కల్వల తేజ, దూస గంగాధర్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

