నిజామాబాద్‌లో విషాద ఘటన.. సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్‌.. ఆర్ఐ మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో (Nizamabad Police HQ) విషాద ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్ ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ (RI Satish) మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని తన నివాస ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఎన్‌ఎస్‌ఓ డ్యూటీతో పాటు పెట్రోలింగ్ విధులు నిర్వహించిన సతీష్, విధులు ముగించుకుని ఉదయం తన సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా అనుకోకుండా తుపాకీ పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

సతీష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి. ఆయన సుమారు పదేళ్లపాటు వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహించి, అనంతరం బదిలీపై నిజామాబాద్‌కు వచ్చారు. సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సీపీ సాయి చైతన్య ప్రకటనలో వెల్లడించారు. సతీష్ ఆకస్మిక మరణంతో నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>