ఖిలా వరంగల్‌ సీలింగ్ భూముల మాయాజాలం.. అసలు దొంగలెవరు?

కలం, వరంగల్‌ బ్యూరో: ఖిలా వరంగల్‌ (Khila Warangal) రెవెన్యూ పరిధి సర్వే నం.188లో సీలింగ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, సీలింగ్‌ భూముల రికార్డుల నిర్వహణ అత్యంత కీలక అంశాలైనప్పటికీ ఆర్డీవో, కలెక్టర్‌ ఆఫీసుల నుంచి వస్తున్న సమాచారం విరుద్ధంగా ఉంది. ఫైల్‌ తమ వద్ద లేదని ఆర్డీవో ఆఫీసు చెబుతుండగా.. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని కలెక్టరేట్‌ ఆఫీసు అంటోంది.

అంతేకాదు నివేదికను సీసీఎల్‌ఏకు అందించనున్నట్టు చెబుతోంది. ఒకే భూమికి చెందిన ఫైల్ ఒక ఆఫీసు తమ వద్ద లేదు అంటుండగా.. మరో ఆఫీసులో విచారణలో ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు రికార్డులు ఎక్కడ ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఏ రికార్డుల ఆధారంగా విచారణ జరుగుతోంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు.

అసలు ఫైల్‌ ఎక్కడ..?

సర్వే నం.188లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణలతో ఆ ఫైల్‌ ఎక్కడుందనేది కీలకంగా మారింది. ఆర్డీవో ఆఫీసులో లేదని చెబుతుండగా, గతంలో ఎక్కడికి పంపారు? ఏ అధికారి వద్దకు వెళ్లింది? కలెక్టరేట్‌కు పంపారా? లేక ఇతర రెవెన్యూ ఆఫీసుకు తరలించారా? అనే స్పష్టత లేదు. దీంతో అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఆర్డీవో ఆఫీసులో అందుబాటులో లేకపోతే.. కలెక్టరేట్‌ అధికారులు ఏ రికార్డులను ఆధారంగా చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు? ఇందులో భాగంగా రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రికార్డులు, పాత ఫైళ్లు పరిశీలించారా? సర్వే నం.188లో ఇప్పటివరకు జరిగిన లావాదేవీలను పూర్తిగా తనిఖీ చేశారా? అనే అంశాలపై స్పష్టత లేదు.

కొరవడిన సమన్వయం

ఫైల్‌ పై రెండు ఆఫీసుల మధ్య స్పష్టత లేకపోవడం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు ‘ఫైల్‌ లేదు’ అనే సమాధానం.. మరోవైపు ‘పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది’ అనే వివరణతో అసలు అధికారిక రికార్డు ఏది? ఎవరి నివేదికను ప్రామాణికంగా పరిగణించాలి? అనే సందేహాలు వస్తున్నాయి. అయితే సర్వే నం.188లో జరిగిన రిజిస్ట్రేషన్లు చట్టవిరుద్ధమా? వాటి వెనుక ఎవరున్నారు? ఏ ఆఫీసు అధికారుల పాత్ర ఉంది? అనే అంశాలు తుది విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. రెవెన్యూ రికార్డులతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులోని రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను కూడా సమగ్రంగా పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

సీసీఎల్‌ఏ నివేదికలో ఏం తేలనుంది?

కలెక్టరేట్‌ విచారణ అనంతరం నివేదికను సీసీఎల్‌ఏకు అందించనున్నట్టు చెబుతుండగా ఆసక్తి నెలకొంది. సర్వే నం. 188లోని భూమి వాస్తవ స్వరూపం, సీలింగ్‌ భూమి పరిధి, జరిగిన రిజిస్ట్రేషన్లు, సంబంధిత రికార్డులు, బాధ్యత వహించిన అధికారులు, తదుపరి చర్యలపై నివేదికలో స్పష్టత రానుంది. ఆర్డీవో ఆఫీసులో ఫైల్‌ లేదని చెప్పినది కూడా ఉన్నతాధికారులు పరిశీలించాల్సి ఉంది. ఫైల్‌ నిజంగా లేకపోతే అది ఎవరి వద్ద ఉంది? ఎక్కడికి బదిలీ అయింది? దానికి సంబంధించిన రికార్డు ఉందా? అనేది తేల్చాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని సీలింగ్ భూముల రిజిస్ట్రేషన్ల అసలు దొంగలు ఎవరో కనిపెట్టాలనే ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>