కలం, వెబ్ డెస్క్: పాలమూరు బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరిని అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా రేవంత్ సర్కార్ నీళ్లు విడుదల చేయడంలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపమని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టుచేసిన బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా..
తెలంగాణలో సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై రిజర్వాయర్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా (BRS Protest) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పలు జిల్లాల్లో రైతులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రోజెక్టుల వద్ద ధర్నా నిర్వహించారు. అయితే ప్రాజెక్టులు వద్ద ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. అటు పాలమూరు రైతులతో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గులాబీ కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట తారాస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పోలీసులను తోసివేశాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

