కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ రైతు సభ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress – BRS) నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. కేటీఆర్ తమ నాయకుడు రాహుల్ గాంధీ ని దూషించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం రాత్రి పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుబేదారి పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నేతలతో పాటు పోలీస్ శాఖ పై గుర్రుగా ఉన్నారు.
చిచ్చు పెట్టిన కేటీఆర్ వ్యాఖ్యలు
మే 6న వరంగల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు సభలో కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రైతు డిక్లరేషన్ బోగస్, ఎన్నికల ముందు వరంగల్ కు వచ్చి 34 హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ సచ్చావ్ అంటూ కఠినమైన భాషను ప్రయోగించారు. అంతే గాకుండా సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘హౌలా, దివానా, ఏం పీకుతున్నావ్ కొడకా. నీ కుర్చీ కాపాడుకోవటానికి ఢిల్లీకి సంచులు మోయడం తప్పా ఏం తెలియదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యు చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ రాజకీయం వేడెక్కింది. కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLA’s) తమదైన శైలిలో స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు.
భగ్గుమన్న కాంగ్రెస్
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు బుధవారం సాయంత్రమే మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన దుఃఖంలో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మీ కుటుంబ సభ్యులంతా కలిసి రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన చరిత్రను మరిచిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని తిట్టే స్థాయి ఉండా అంటూ ప్రశ్నించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. అంతటితో ఆగని కాంగ్రెస్ నేతలు సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
బీఆర్ఎస్ నేతల కౌంటర్
కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ (BRS) తప్పుపట్టింది. రాజకీయ విమర్శలకు కేసులు పెట్టడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పాలక వర్గం పదవి కాలం బుధవారంతో ముగిసింది. కొద్దీ రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఒత్తిడి పెంచేందుకు ఈ వివాదాన్ని వాడుకుంటున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ లీగల్ యాక్షన్ తీసుకోవడం, బీఆర్ఎస్ దాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

