Mobile Popup Ad
Mobile Popup Ad

బాకీ కార్డులతో రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ మోసాన్ని అసెంబ్లీలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కేటీఆర్ (KTR), డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ‘అభయహస్తం’ మేనిఫెస్టోతో ప్రజలను నమ్మబలికి ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ హామీలకు చట్టబద్ధత కల్పించకుండా, నిధులు కేటాయించకుండా ప్రజలను వంచిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ మోసాన్ని నిలదీయడానికే అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ నిరసన చేపట్టామని తెలిపారు.

ప్రతి వర్గాన్ని వంచించారు..

జేమ్స్ బాండ్‌ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చి, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పుడు మూడో బడ్జెట్‌లో కూడా ‘గ్యారెంటీ’ అన్న మాట లేకుండా, ‘డిక్లరేషన్’ అన్న మాట లేకుండా ప్రతి వర్గాన్ని వంచిస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా రూ.20 వేల కోట్లకు మించకుండా కేటాయించడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్న రూ. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు 18 ఏళ్లు నిండిన కోటి 58 లక్షల మందికి ఇస్తామని చెప్పిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ హామీ అమలు చేయాలని చెప్పారు.

ప్రజల తరఫున నిలదీస్తాం..

రైతులకు రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఉన్న రైతుబంధునే అమలు చేయడంలో విఫలమయ్యారని కేటీఆర్ (KTR) విమర్శించారు. సంక్రాంతికి రావాల్సిన డబ్బులు ఉగాది దాటినా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇది యువతను మోసం చేయడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రతి అడుగునా రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తామని చెప్పారు. హామీలు నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Read Also: తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>