ముస్లిం, క్రిస్టియన్ ఓటర్ల తొలగింపే బీజేపీ టార్గెట్: కేటీఆర్

కలం, తెలంగాణ బ్యూరో: ఎలక్షన్ కమిషన్ వాడుతున్న ఈవీఎంలపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని, వాటి పనితీరుపై నమ్మకం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇప్పుడు ‘సర్’లో పెద్ద కుట్ర ఉన్నట్లుగానే ఈవీఎంల విషయంలోనూ అలాంటి సందేహాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ల బూత్ లెవల్ ఏజెంట్లు, అసిస్టెంట్లను ఉద్దేశించి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో శనివారం మాట్లాడుతూ, మళ్ళీ పేపర్ బ్యాలెట్ వస్తేనే అన్ని అనుమానాలకు చెక్ పెట్టొచ్చన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్లతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ తరఫున హాజరైన ఆరుగురం స్పష్టం చేశామని గుర్తుచేశారు. అమెరికా, జర్మనీ లాంటి దేశాలే ఈవీఎంల విధానాన్ని కొంతకాలం అమలు చేసి ఆ తర్వాత పేపర్ బ్యాలెట్ సిస్టమ్‌కు వెళ్లాయన్నారు.

ఈవీఎం కంట్రోల్ యూనిట్లే మారిపోతున్నాయి :

ఈవీఎంలలో ఓట్లు మారిపోతున్నాయనేది ఒక అనుమానమైతే పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత డబ్బాలే (కంట్రూల్ యూనిట్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గోల్‌మాల్ అవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈవీఎంలలో ఏదో చిప్ ఉన్నదంట.. అందుకే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నది… అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని, తనతో చాలా మంది పలు సందర్భాల్లో చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈవీఎంలపై నమ్మకం లేనందునే పేపర్ బ్యాలెట్ మంచి విధానమని అనుకుంటున్నారని, ఒకసారి కౌంటింగ్‌లో తేడా వస్తే బ్యాలెట్ పేపర్‌లను తిరిగి చూసుకునే వీలు ఉన్నదని, కానీ ఈవీఎంలలో ఏదో మతలబు ఉన్నదనే కారణంగా రీ కౌంటింగ్ చేసినా వచ్చిన ఫలితంతో సంతృప్తి లేదని అన్నారు. ఎన్నికల్లో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యమని, ఓటర్ల జాబితా నుంచి ఈవీఎంల వరకు అన్నింటా పార్టీలకు, ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈసీదేనని అన్నారు.

ముస్లిం, క్రిస్టియన్లను తీసేయడమే బీజేపీ పని :

“బీజేపీకి కొన్ని పిచ్చిపిచ్చి ఆలోచనలు ఉంటాయి.. క్రిస్టియన్లు, ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేయరు.. అందుకే వారి పేర్లను లిస్టు నుంచి కట్ చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన… బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఇదే జరిగింది… అక్కడ లాలూ ప్రసాద్, రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ దీనిపైనే ఆందోళన చేశారు… ఇప్పుడు ‘సర్’ పేరుతో మన దగ్గరా ఇలాంటివి జరగొద్దు..” అని కేటీఆర్ అన్నారు. “తెలంగాణలో బీజేపీ లేదు.. మొన్న పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక గాడ్పు లాగా గెలిచింది. మన దగ్గర ఆ పార్టీ గ్రౌండ్‌లో లేనే లేదు… సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ… బిల్డప్ తప్ప ఆ పార్టీకి ఏమీ లేదు… గోతి కాడ నక్క లాగా ఏదో ఒక సందు దొరికితే గుసాయించాలని చూస్తున్నది..” అని కేటీఆర్ పైర్ అయ్యారు. అన్ని వ్యవస్థలనూ అది వాడుకుంటున్నదని ఆరోపించారు.

చాలా మందికి రెండేసి ఓట్లు ఉన్నాయి :

రాష్ట్రంలోని 36,500 బూత్‌లలో ఏజెంట్లు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, ఇతర పార్టీలకు మాటలు, బిల్డప్ మాత్రమే ఎక్కువ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బూత్ ఇన్‌చార్జి ఎవరో ఇప్పటికీ ప్రజలకు తెలియదన్నారు. రాష్ట్రంలో చాలా మంది ఓటర్లలో రెండు చోట్ల లిస్టులో పేర్లు ఉన్నాయని, ఇది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. త్వరలోనే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు వస్తాయని, ఇప్పటి నుంచే ఆశావహులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, టికెట్ కోసం పోటీపడాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, ఇప్పటి నుంచే బస్తీల్లో తిరిగి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>