మోదీకి పేదలపై ప్రేమ‌ లేదు: సీపీఐ నేత‌ సురేందర్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉంది కదా అని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కార్పొరేట్లపై ఉన్న ప్రేమ పేద ప్రజలపై లేదని సీపీఐ కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి (Kasireddy Surender Reddy)ఆరోపించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కమాన్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగిందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఓడ ఎక్కేదాక ఓడ మల్లయ్య ఓడ దిగినాక బోడ మల్లయ్య అనే చందంగా నరేంద్ర మోదీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రం వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం వేసిందని విమ‌ర్శించారు.

గతంలో వాణిజ్య గ్యాస్ ధర పెంచడంతో టీస్టాల్, టిఫిన్ సెంటర్ లలో ధరలు పెంచారని, పేదలు కనీసం బయట టిఫిన్ చేయడానికి కూడా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కొంత కాలం క్రితం అమెరికా,ఇజ్రాయిల్ ఏకమై ఇరాన్ పై బాంబుల దాడులు చేయడం వల్ల అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడే అవకాశం ఉందని విస్తృత ప్రచారం జరిగినా కేంద్రం మాత్రం అలాంటి పరిస్థులు లేవని ప్రజలను నమ్మబలికారని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ తగ్గినప్పుడు కూడా దేశంలో మోదీ ప్రభుత్వం చమురు ధరలు తగ్గించలేదని,పైగా ఇంధ‌న వాడకం తగ్గించాలని మోదీ ఉచిత సలహాలు ప్రజలకు ఇస్తున్నాడాని అన్నారు. ధరల పెరగడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, వాటితో పాటు అన్ని రంగాలపై ప్రభావం పడి పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రజలపై భారం వేయడానికి పూనుకున్న కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, టేకు మల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి,బామండ్ల పెల్లి యుగేందర్, బూడిద సదాశివ,నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం,బాకం ఆంజనేయులు,చెంచల మురళి, నూనావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>