కలం, జోగులంబ గద్వాల: ధరూర్ మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద ఉన్న కే.టి. దొడ్డి ఎంజేపీటీ బీసి వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో (KT doddi BC Welfare School) విద్యార్థులు అసౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. వీరు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఒంటికి, రెంటికి ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పగలు రాత్రి తేడా లేకుండా రెండింటికి గోడ దూకి వ్యవసాయ పొలాల వెంబడి వెళ్లాల్సి వస్తుందని విద్యర్థులు ఆరోపించారు. రాత్రి వేళలో ఏదైన పురుగు పుట్ర కరిస్తే విద్యార్థుల ప్రాణాల మీదకు ఆపదవచ్చే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుత్తేదారుల నిర్లక్ష్యంతో బాత్రూమ్ నిర్మాణాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వేసవి సెలవుల్లోనే ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా నిర్మాణాలు చేపట్టక పోవడం, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన గురుకులాల అధికారులు దృష్టి సారించి మూత్రశాలలు, బాత్రూమ్ లు నిర్మించడం లేదన్నా ఆరోపణలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాత్రూమ్ నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

