కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని దేవాదుల ప్రాజెక్టు 10 మోటార్లు నడపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. లేకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లపై ఉన్న ధ్యాస, నీటి బొట్లు ఎత్తడంపై లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.
నీళ్లు ఇవ్వడం లేదు..
ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. జూలై 12 రోజునే దేవాదుల (Devadula Project) పంపులు ఆన్ చేయమని నిలదీశామని..13వ తేదీన భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారని దుయ్యబట్టారు. అక్కడికి వెళ్లి పరిశీలించినా.. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా ఉత్తమ్ కు తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతామని, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని మాయమాటలు చెప్పి ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు లేక వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు మోటార్లు నడపట్లేదు..
ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని హరీశ్ రావు దుయ్యబట్టారు. సమ్మక్క బ్యారేజీ కట్టి, దేవాదుల మూడు ఫేజులు పూర్తి చేసి కేసీఆర్ నీళ్లు ఎత్తడానికి సిద్ధంగా పెట్టారని.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు. రూ. 8 కోట్ల బిల్లులు ఇవ్వకుండా గతేడాది 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ చేశారని.. దేవాదుల కింద రూ.700 నుంచి రూ.800 కోట్ల విలువైన పంట ఎండిపోయిందని అన్నారు. ఈసారి కూడా ఎల్‌నినో వస్తుందని చెబుతున్నా మొద్దునిద్ర పోతున్నారా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? అని ప్రశ్నించారు.
ఎవరిది కరెక్ట్?
కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దు అంటారని.. అటు మంత్రులేమో 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని విమర్శించారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్‌ది ఒక మాటా? మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా? అని ప్రశ్నించారు. గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నా.. కలెక్టర్ ఎందుకు తూములు మూసారు? అని ప్రశ్నంచారు. దీనిపై రైతులకు మంత్రులు క్షమాపణలు చెప్పాలన్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 50 రోజులు అవుతున్నా ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. ఎల్‌నినో పేరు చెప్పి రైతులకు ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.
Read Also: హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. విద్యార్థుల అరెస్టు
Follow Us On: X(Twitter)

