కలం, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత (Kothagudem Clash) చోటుచేసుకుంది. ఒక వివాహేతర సంబంధం వ్యవహారం వివాదానికి దారితీయడంతో ఇరువర్గాలు రోడ్డుకెక్కి దాడులకు దిగాయి. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ ఆ తర్వాత తీవ్ర స్థాయికి చేరి పరస్పర దాడులుగా మారింది.
ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకుంటూ రెండు వర్గాల ప్రజలు పదుల సంఖ్యలో ఏకంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లారు. స్టేషన్ ప్రాంగణంలో కూడా ఇరువర్గాలు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల కారణంగా సిబ్బందిలో ఎక్కువ మంది బయట ఉండటంతో, పీఎస్లో తక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి ఆకతాయిలు స్టేషన్ లోపలే హల్చల్ చేశారు. అయితే అక్కడే ఉన్న నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు వెంటనే స్పందించి, ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

