కాంగ్రెస్‌లో సిరాజ్ హుస్సేన్‌కు కీలక బాధ్యతలు

కలం, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు ఎస్‌కే. సిరాజ్ హుస్సేన్‌కు (SK Siraj Hussain) టీపీసీసీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించారు. పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, క్షేత్రస్థాయిలో అందించిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గత 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సిరాజ్ హుస్సేన్ విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా, మహదేవ్‌పూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గ టీపీసీసీ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర నాయకులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. గుల్బర్గా లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ మైనారిటీ విభాగం పరిశీలకుడిగా, 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చుంచురా నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ మాస్టర్ ట్రైనర్‌గా కూడా సేవలందించారు.

ప్రజాసేవలోనూ ముందంజ

రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సిరాజ్ హుస్సేన్ చురుగ్గా పాల్గొన్నారు. పేదలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందేలా కృషి చేశారు. కరోనా సమయంలో ఆహార పొట్లాలు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ జన్మదినాల సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లా మైనారిటీ ఉద్యోగుల సంఘానికి సలహాదారుగా వ్యవహరించారు. జర్నలిజం రంగంలోనూ అనుభవం కలిగిన ఆయన మహదేవ్‌పూర్ మండలంలో సాక్షి తెలుగు దినపత్రిక విలేకరిగా, మంథని నియోజకవర్గంలో చురకలు పత్రికలో, మానకొండూరు నియోజకవర్గంలో మున్సిఫ్ ఉర్దూ దినపత్రిక కరస్పాండెంట్‌గా పనిచేశారు.

పార్టీ ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తా: సిరాజ్ హుస్సేన్

పీసీసీ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించడం పట్ల సిరాజ్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని, పదవులు ఆశించకుండా కార్యకర్తగా ప్రజల మధ్య ఉంటూ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించానని తెలిపారు. తన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడం గౌరవంగా, మరింత బాధ్యతగా భావిస్తున్నా అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొడతానని చెప్పారు. పార్టీ విధానాలు, అధిష్ఠానం నిర్ణయాలు, ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రజలకు వివరించడంతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుకగా, పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన నాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధి, ప్రజాసేవకు కృషి చేస్తానని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>