కలం, ఖమ్మం బ్యూరో: పోడు సాగుదారుల (Podu Farmers) పై నిర్బంధాలు ఆపాలని, సాగు భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు స్వస్తి చెప్పాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో పోడు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల ఉపాధి దెబ్బతింటుందన్నారు.
సాగులో భూముల్లో కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి చర్యల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అటవీశాఖ తీసుకునే ప్రతి చర్యకు, తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. అడవుల సంరక్షణ ఎంత ముఖ్యమో, పేదవారి కడుపు నిండడం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల వంటి అభివృద్ధి పనులకు అటవీశాఖ అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఫారెస్ట్ క్లియరెన్స్ వేగంగా ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎఫ్డీఎ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేశ్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: 25 ఏళ్ల తరువాత ఏంటి ?.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Follow Us On: X(Twitter)

