కత్తుల దాడికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన ‘సర్కారు’ దవాఖానా

​కలం, ఖమ్మం బ్యూరో: రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ సామాన్యుడికి అర్ధరాత్రి వేళ లభించిన తక్షణ వైద్యం నూరేళ్ల ఆయువును ప్రసాదించింది. కార్పొరేట్ దవాఖానాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా చేసింది కొత్తగూడెం (Kothagudem) ప్రభుత్వాస్పత్రి. ​శనివారం రాత్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీలోకి 45 ఏళ్ల ఓ వ్యక్తిని అత్యవసరంగా తరలించారు. పదునైన ఆయుధాలతో జరిగిన దాడిలో బాధితుడి ముఖం, మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. కుడి చెవి భాగం కూడా తెగిపడింది. ఏమాత్రం ఆలస్యమైనా విపరీతమైన రక్తస్రావంతో ప్రాణాలు గాలిలో కలసిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

​ఆ క్లిష్టమైన క్షణాల్లో డ్యూటీలో ఉన్న వైద్యులు ఏమాత్రం తడబడలేదు. చీఫ్ సర్జన్, జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంప్రకాష్ పర్యవేక్షణలో వైద్య బృందం స్పందించింది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఫరూక్, స్టాఫ్ నర్సుల సహాయంతో లోకల్ అనస్తీషియా అందించి లోతైన గాయాలకు కుట్లు వేయడం ప్రారంభించారు. ఒకవైపు రక్తస్రావాన్ని అరికడుతూనే, మరోవైపు తెగిపోయిన కుడి చెవి నిర్మాణాన్ని నైపుణ్యంతో చికిత్స అందించారు. అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ రమేష్ ఆపరేషన్ సమయంలోనే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం అందించాల్సిన క్రిటికల్ కేర్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించారు. ప్రాణాపాయ స్థితిని దాటొచ్చిన రోగి ప్రస్తుతం పూర్తి నిలకడగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

​జిల్లా కలెక్టర్ అంకిత్ అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, ఆసుపత్రిలో మౌలిక వసతులు, క్రిటికల్ కేర్ విభాగాలను బలోపేతం చేయడం వల్లనే ఇటువంటి క్లిష్ట శస్త్రచికిత్సలను అర్ధరాత్రి వేళ కూడా స్థానికంగానే చేయగలుగుతున్నామని వైద్య వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసిన సిబ్బందిని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాధామోహన్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>