మ‌హారాష్ట్ర‌లో దాండియాకు వీహెచ్‌పీ రూల్స్‌!

క‌లం, వెబ్‌డెస్క్: మ‌రికొద్ది రోజుల్లో దేశంలో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌పై విశ్వ హిందూ ప‌రిష‌త్ (VHP) ప్ర‌క‌టించిన కొత్త నిబంధ‌న‌లు వివాదాస్ప‌దంగా మారాయి. అక్టోబ‌ర్ 11 నుంచి ప్రారంభం కానున్న గర్భా, దాండియా (Garba Dandiya) వేడుక‌ల్లో ముస్లింల‌ను అనుమ‌తించ‌బోమ‌ని బీహెచ్‌పీ జాతీయ సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీరాజ్ నాయ‌ర్ స్ప‌ష్టం చేశారు. విగ్ర‌హారాధ‌న‌ను వ్య‌తిరేకించే ముస్లింలు హిందూ దేవ‌త‌ను పూజించే ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డం త‌గ‌ద‌ని ఆయ‌న వాదించారు. హిందూ సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించేందుకే ఈ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని, దీన్ని వేరే విధంగా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

గర్భా, దాండియా ఉత్సవాల్లో వీహెచ్‌పీ రూల్స్ ఇవే…

– ఈ వేడుక‌ల్లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుర్తింపును నిరూపించుకోవ‌డానికి ఆధార్ కార్డు చూపించ‌డం త‌ప్ప‌నిస‌రి

– ఉత్స‌వాల వ‌ద్ద‌కు వ‌చ్చే వారి నుదుటిపై తిల‌కం త‌ప్ప‌కుండా ధ‌రించాలి

– ఒక వేళ ముస్లింలు ఈ వేడుక‌ల్లో పాల్గొనాలి అనుకుంటే వారు త‌మ కుటుంబ‌స‌భ్యులు, భార్య‌లు, పిల్ల‌లు, సోద‌రీమ‌ణులతో క‌లిసి రావాలి. లేదా ముస్లింలు త‌మ నివాస ప్రాంతాల వ‌ద్ద మ‌సీదుల ద‌గ్గ‌ర ప్ర‌త్యేకంగా న‌వ‌రాత్రి వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌చ్చు.

అయితే వీహెచ్‌పీ నిర్ణ‌యంపై రాజ‌కీయ, సామాజిక వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, స‌మాజంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు, మ‌త సామ‌ర‌స్యానికి భంగం క‌లిగిస్తుంద‌ని కాంగ్రెస్‌, శివ‌సేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) నేత‌లు మండిప‌డుతున్నారు. ముఖ్యంగా అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేశారు. మ‌రోవైపు ఎవ‌రి మ‌తాన్ని వారు ఆచ‌రించే హ‌క్కు ఉంద‌ని మ‌హారాష్ట్ర మైనార్టీ క‌మిష‌న్ చైర్మ‌న్ ప్యారే ఖాన్ తెలిపారు. నిబంధ‌న‌ల పేరిట ఇలా ఒక వ‌ర్గాన్ని బ‌హిష్క‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. పండుగ‌ల పేరుతో ప్ర‌జ‌ల‌ను విభ‌జించ‌డం మానుకోవాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>