కలం, పెద్దపల్లి: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. రాష్టంలో కొత్త జిల్లాలు ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మమతా రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువయ్యాయని, స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం వల్ల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అభివృద్ధి పనుల అమలు సులభతరమైందని అన్నారు.
పరిపాలన అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు పొందడం సులభమైందని మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి ఉష, గంట రాములు, రఘువీర్ సింగ్, దాసరి ప్రశాంత్ రెడ్డి, చిరుమల్ల రాకేష్, ఉప్పు రాజ్ కుమార్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, పెంచాల శ్రీధర్, కొయ్యడ సతీష్, కొయ్యడ విక్రం, మార్కు లక్ష్మణ్ తదితర పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

