గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై చిరుమర్తి కీలక పిలుపు

కలం, నకిరేకల్: రాబోయే వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణ గార్డెన్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం, ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని డిగ్రీ పూర్తి చేసిన యువత, ఉద్యోగులు, సీనియర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను కలిసి అర్హులైన వారందరికీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు చేయించాలని కోరారు. కరోనా వంటి కష్టకాలంలోనూ కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు.

గత ఎనిమిది నెలలుగా మూసీ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయకుండా, సాగునీటిని వృథాగా దిగువకు వదిలేస్తూ ప్రాజెక్టును ఖాళీ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వేసవిలో మూడో పంటకు సాగునీరు అందించాలని రైతులు కలెక్టర్లు, అధికారులను కోరుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో వేసవిలోనూ చెరువులను నింపిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>