కలం, హనుమకొండ: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనే సామాజిక రుగ్మతను నిర్మూలించేందుకు (Drug Abuse Awareness) ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని ఆమె సూచించారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ) హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్, బిల్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ సే నో టు డ్రగ్స్’ నినాదాలతో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత తదితరులతో కలిసి జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ర్యాలీ అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో కలిసి “సే నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా పిల్లల ప్రవర్తనపై నిరంతరం దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, డీపీఆర్వో అయూబ్ అలీ, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, టీఎస్జేయూ జిల్లా నాయకులు, జర్నలిస్టులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నగరంలో డ్రగ్స్ నిర్మూలనపై చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది.

