నల్గొండ నా ఊపిరి.. శ్వాస ఉన్నంతవరకు ప్రజల కోసమే పనిచేస్తా: కోమటిరెడ్డి

కలం,నల్లగొండ : “నల్లగొండ అంటే పోరాటం, త్యాగం, తిరుగుబాటు, ఆత్మగౌరవానికి ప్రతీక. నల్లగొండ జిల్లానే నా ఊపిరి.. నా చివరి శ్వాస ఉన్నంత వరకు జిల్లా ప్రజల సంక్షేమం, ప్రాంతాభివృద్ధి కోసమే పాటుపడతా” అని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఏనాటికీ శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసిన పోరాటాలే చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు.

నల్గొండలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్​కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాను పోరాటాల గడ్డ స్థాయి నుంచి రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

నల్లగొండ పట్టణంలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ. 83 కోట్లతో చేపట్టిన 24 గంటల సురక్షిత తాగునీటి ప్రాజెక్టు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధి కోసం అదనంగా మరో రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అమరవీరుల త్యాగాల సాక్షిగా నల్లగొండను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ. 20 కోట్లతో ఎన్-ఏ-సి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించడానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ జిల్లా బిడ్డగా మీకు మాట ఇస్తున్నా.. జిల్లాలో తాగునీరు, సాగునీటి కష్టాలను పూర్తిగా తీర్చి, నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>