కలం, ఢిల్లీ: ఫారిన్ టూర్ వెళ్లాలనుకునే ఇండియన్స్ ఎంచుకుంటున్న డెస్టినేషన్లలో ఇప్పుడు శ్రీలంక (Sri Lanka) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని ఆన్‌లైన్ వీసా సర్వీసెస్ ఫ్లాట్‌ఫాం ‘అట్లిస్’ విడుదల చేసిన తాజా ‘ట్రావెల్ యాక్సెస్ రిపోర్ట్’ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ మధ్య శ్రీలంక వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది.
సాధారణంగా వేసవి, పండుగల సీజన్లలో ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే టూరిస్టులు.. ఇప్పుడు శ్రీలంకను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, మాల్దీవులు, ఒమన్, మారిషస్ దేశాలు నిలిచాయి. వీసా సౌలభ్యం (25%), కనెక్టివిటీ (25%), అందుబాటు ధర (15%), ప్రజాదరణ (35%) అనే నాలుగు కొలమానాల సూచిక ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారుచేసినట్టు అట్లిస్ వెల్లడించింది.
ప్రయాణం మూడు గంటలే!
భారత్‌కు శ్రీలంక భౌగోళికంగా దగ్గరగా ఉండటం అతిపెద్ద ప్లస్. ఫ్లైట్‌లో అయితే.. ఇండియా నుంచి శ్రీలంకకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కొచ్చి వంటి నగరాల నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. శ్రీలంకలోని కొలంబోతో పాటు జాఫ్నా వంటి నగరాలకు ఇండియాలోని ప్రముఖ సిటీల నుంచి కనెక్టివిటీ పెరుగుతున్నది.
ఈ యేడు మార్చిలో ఢిల్లీ–కొలంబో మధ్య ఇండిగో నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. జూన్‌లో అహ్మదాబాద్–కొలంబో మధ్య నాన్‌స్టాప్ సర్వీసు ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వారానికి దాదాపు 90 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది.
ఈజీ వీసా ప్రాసెస్
ఫారిన్ టూర్స్ విషయంలో భారతీయులు ఎదుర్కొనే పెద్ద సమస్యల్లో ఒకటి వీసా ప్రాసెస్. దరఖాస్తు, డాంక్యుమెట్ల సబ్మిషన్, ప్రాసెసింగ్ టైమ్, అపాయింట్‌మెంట్లు.. ఇలా చాలా టైం వృథా అవుతుంది. కానీ.. శ్రీలంక వీసా చాలా ఈజీగా లభిస్తుంది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు శ్రీలంక ప్రభుత్వం ఉచిత టూరిస్ట్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఇస్తుంది. ఈ ఆన్‌లైన్ వీసా వ్యాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది.
తక్కువ బడ్జెట్
ఇతర ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్‌తో పోలిస్తే.. శ్రీలంకలో వసతి, ఫుడ్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ వంటివి కాస్త చవకగా లభిస్తాయి. దాంతో ఇండియన్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌కు అనుకూలమైన దేశంగా మారింది. పైగా ఒకే దేశంలో బీచ్‌లు, టీ ఎస్టేట్లు, కొండ ప్రాంతాలు, బౌద్ధ క్షేత్రాలు, వన్యప్రాణి సఫారీలు, ఇండియాతో సంబంధం ఉన్న చారిత్రక ప్రదేశాలు.. ఇలా భిన్నమైన అనుభవాలు లభించడం మరో ప్లస్. పైగా మనకు శ్రీలంకన్ కరెన్సీ, నగదు చెల్లింపుల్లో అడ్డంకులు ఉండవు. ఎందుకంటే అక్కడ యూపీఐ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
అమెరికా 26వ స్థానంలో
అట్లిస్ ర్యాంకింగ్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. భారతీయలు టూర్ వెళ్లాలి అనుకుంటున్న దేశాల లిస్ట్‌లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి సంపన్న దేశాలు చాలా వెనుకబడ్డాయి. బ్రిటన్ 23వ స్థానంలో, అమెరికా 26వ స్థానంలో ఉన్నాయి. వీసా ప్రక్రియ, ఎక్కువ ఖర్చు, ఎక్కువ ప్రయాణ సమయం వంటి అంశాలే ఇందుకు కారణాలని నివేదిక వెల్లడించింది.
భారత్‌దే టాప్ ప్లేస్
• ఇది కేవలం అట్లిస్ నివేదికలో కనిపించిన ట్రెండ్ మాత్రమే కాదు. శ్రీలంక అధికారిక పర్యాటక గణాంకాలు కూడా భారతీయ టూరిస్ట్‌ల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిస్తున్నాయి.
• 2025లో శ్రీలంకకు వెళ్లిన మొత్తం విదేశీ పర్యాటకుల్లో భారత్ అతిపెద్ద సోర్స్ మార్కెట్‌గా నిలిచింది. మొత్తం ఎంట్రీల్లో మన వాటా సుమారు 22.5 శాతంగా ఉంది.
• గతేడాదితో పోలిస్తే.. 2026 జనవరి–మే మధ్య కాలంలో భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన పర్యాటకుల సంఖ్య 2,04,060 నుంచి 2,50,260కి పెరిగింది. ఏడాదిలో సుమారు 22.6 శాతం పెరిగింది.

