కలం, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Corporation) పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయిందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) ఎద్దేవా చేశారు. సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలకవర్గంలో కీలకంగా వ్యవహరించిన వారే ఈరోజు బీజేపీ పాలకవర్గంలో ఉన్నారని.. నరమాంసం అలవాటుపడ్డ వారిని సాధువులుగా మారమంటే ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను ప్రశ్నించారు.
గత పాలకవర్గంపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు బీజేపీ మాయమాటలు నమ్మి ఓటు వేశారని కానీ.. కార్పొరేషన్ పరిస్థితి మాత్రం పేనం మీది నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని నరేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. ముఖ్యంగా ఒకవైపు డంపు యార్డు సమస్య, మరొక వైపు విలీన గ్రామాల డివిజన్లలో అనేక రోడ్ల నిర్మాణానికి తట్టెడు మట్టి పోయని పరిస్థితి ఉందని అన్నారు.
నగరంలో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, పౌర సేవలు సరిగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. వీటిపై శ్రద్ధ వహించాల్సింది పోయి.. సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి నాలుగు రోజులకొకసారి మీడియా ముందుకు వచ్చి.. ఇదిగో అదిగో అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరేందర్ రెడ్డి అన్నారు. యుఐడీఎఫ్ కు పూర్తి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని.. యూసీఎఫ్ లో కూడా 75 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇవే కాకుండా కరీంనగర్ అభివృద్ధికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సిన నిధులు మంజూరు చేయించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ గంట శ్రీనివాస్ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి,జీడి రమేష్,దన్న సింగ్,షబానా మహమ్మద్,దండి రవీందర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కుర్ర పోచయ్య, లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి, సాయిరాం, జిలుకర రమేష్, ఖలీల్, సుదర్శన్, హనీఫ్, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.

