కలం, కరీంనగర్ బ్యూరో : పెట్రోల్, డీజిల్ పై లీటరుకు నాలుగు రూపాయల చొప్పున భారం వేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం ప్రభుత్వం ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి మాట్లాడారు. మోదీ సర్కార్ మొదటి నుంచి మాటల గారడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారదత్తం చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారి పెంచితే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, విడుతల వారీగా పెంచుతూ ప్రజలపై తీవ్ర భారం మోపిందన్నారు. ఇప్పటికైనా ధరల పెరుగుదలను ఆపాలని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఖాళీ ఖజానా అప్పజెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ధరలు పెంచలేదని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నీట్ పరీక్షా పత్రం లీక్ తో దేశ వ్యాప్తంగా 26 లక్షల మంది, రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీకి మైకు దొరికితే మాటల గారడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టింస్తారు తప్పా పాలన మాత్రం చేత కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా పత్రం లీక్ పై బీజేపీ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన లాగే బీజేపీ ప్రభుత్వం కూడా నడుస్తుందన్నారు. సమావేశంలో తాజొద్దీన్, పిట్టల రవీందర్, కార్పోరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, నాయకులు చాడగొండ బుచ్చిరెడ్డి, టెల భూమయ్య, సరిల్ల ప్రసాద్, బాలరాజు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, మ్యాకల నర్సయ్య, బత్తిని చంద్రయ్య, సుదర్శన్, మాసుం ఖాన్, శ్రీధర్ రెడ్డి, షెహెన్ష, భారీ, బషీర్, ఖలీల్, జమీల్, హనీఫ్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

