కలం, వెబ్ డెస్క్: వాంఖడే స్టేడియంలో కేకేఆర్ విజృంభించింది. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, రఘువంశీ అదరగొట్టారు. మిగిలిన ప్లేయర్లు కూడా ఏమాత్రం దూకుడు తగ్గకుండా అదరగొట్టారు. ఇక ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ తన సత్తా చాటుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు చేసి విధ్వంసానికి తెరలేపాడు.
అనంతరం వచ్చిన యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ ముంబై బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. చివర్లో ఫినిషర్ రింకూ సింగ్ 21 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కరే 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించారు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. అఫ్గాన్ స్పిన్నర్ గజన్ఫర్ 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకోగా, ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్, తిలక్ వర్మ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న తరుణంలో ముంబై ఈ భారీ టార్గెట్‌ను ఎలా ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

