కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) సమీపంలో జాతీయ రహదారి 65పై ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న యోలో ట్రావెల్స్ బస్సు ముందర వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

