దుమ్మురేపిన కేకేఆర్ బ్యాటర్స్.. గుజరాత్ టార్గెట్ 247

క‌లం, వెబ్ డెస్క్‌: హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్యాటర్లు దుమ్మురేపారు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మైదానంలో పరుగుల వరద పారించారు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తే.. ఆ ఊపు ఏమాత్రం తగ్గకుండా రఘువంశీ, గ్రీన్ ఆటను కొనసాగించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. కెప్టెన్ అజింక్య రహానే (14 బంతుల్లో 14 పరుగులు) మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం గుజరాత్‌కు ఊపిరి తీసుకోనివ్వలేదు. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 ఆకాశం లాంటి సిక్సర్లతో 93 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వచ్చి సాయి కిశోర్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొదటి వికెట్‌కు 44 పరుగులు రాగా, రెండో వికెట్‌కు అలెన్-రఘువంశీ జోడి 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ఫిన్ అలెన్ అవుటైనా రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా అంగ్‌క్రిష్ రఘువంశీ, కెమరూన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. రఘువంశీ వికెట్ కీపర్ బాధ్యతలను మోస్తూనే బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా వచ్చిన కెమరూన్ గ్రీన్ కేవలం 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేకేఆర్ బ్యాటర్ల దాటికి గుజరాత్ బౌలర్లు చేతులెత్తేశారు. మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, సాయి కిశోర్ 3 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 57 పరుగులు సమర్పించుకోగా, అర్షద్ ఖాన్ ఒకే ఓవర్ వేసి 22 పరుగులు ఇచ్చుకున్నాడు. గుజరాత్ ఈ మ్యాచ్ గెలవాలంటే 20 ఓవర్లలో 248 పరుగులు చేయాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>