కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నది. అధికారుల ముందస్తు ప్రణాళికా లోపం ఆందోళన రేపుతున్నది. పంటలకు సరిపడా ఎరువులు సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతింటా యేమోనని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. వరి, పత్తి, మిర్చితో పాటు మొక్కజొన్న, పెసర, కంది పంటల కోసం దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. నిల్వలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఈసారి 5,43,970 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు లేకపోవడం రైతులను భయాందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే ఎరువుల ధరలు సంచికి రూ.300 నుంచి రూ.400 వరకు పెరగడంతో ఒక్కో రైతుపై రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది. ఖర్చు తగ్గించుకోవడానికి డీఏపీ (రూ.1,350)కి బదులు నాన్-డీఏపీ (రూ.560) వాడాలని అధికారులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సరఫరా లేకపోవడం అసలు సమస్యగా మారింది.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
వానాకాలం మొదలైనా అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంపై రైతులు మండి పడుతున్నారు. పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో అవగాహన కల్పించడంలోనూ వ్యవసాయ శాఖ విఫలమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విత్తనాలు నాటే సమయానికి ఎరువుల కొరత (Fertilizer Shortage) లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

