కలం, ఉట్నూరు : ఉట్నూరు మండల పరిధిలోని తక్కుగూడ, సలేవాడ బి, బిర్సాయిపేట్, రామ్నగర్ గ్రామాల్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో (Dandari Celebrations) ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పాల్గొని సందడి చేశారు. ఆదివాసీ కళాకారులతో కలిసి సంప్రదాయ గుస్సాడి నృత్యం చేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
దండారి ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులైన ధోతీలను ధరించాలని సూచించారు. దండారి ఉత్సవాల ప్రోత్సాహానికి ప్రభుత్వం తరఫున రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

