కలం, నిర్మల్: ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న (Double Bedroom Residents) తమకు వెంటనే ఇళ్ల పట్టాలు (House Pattas) జారీ చేయడంతోపాటు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారులకు పట్టాలు అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో డంపింగ్ యార్డ్ ను తొలగించి, సెల్ టవర్ నిర్మించాలని కోరారు. ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి వారి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాలనీ సమీపంలోని మిగులు భూమిని సర్వే చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. కాలనీలో నివసిస్తున్న హిందూ, ముస్లింలకు వేర్వేరుగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ రాథోడ్ రమేష్‌కు వినతి పత్రం అందజేశారు.

