కలం, తెలంగాణ బ్యూరో: “ప్రభుత్వ, సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు.. మా ప్రభుత్వానికి కేవలం గణాంకాలు కాదు.. వాళ్లంతా మా సొంత పిల్లలు.. వాళ్లకు అత్యుత్తమ సదుపాయాలు అందించాలని మేం కృతనిశ్చయంతో ఉన్నాం”.. ఇవీ తరచూ మంత్రులు చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ స్టూడెంట్‌కు ఏడాదికి రెండు జతల యూనిఫామ్ (School Uniforms) ఉచితంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఏకలవ్య స్కూల్ మొదలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కస్తూర్బా పాఠశాలల వరకు అందరికీ కుట్టించాలని నిర్ణయించింది.
కానీ స్కూళ్లు ప్రారంభమై ఆరు నెలలు అవుతున్నా.. దాదాపు సగం విద్యా సంవత్సరం ముగిసినా.. ఇంకా 3.67 లక్షలకు పైగా యూనిఫామ్స్ విద్యార్థులకు అందాల్సి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 26.65 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రెండు జతల చొప్పున మొత్తం 53.30 లక్షల యూనిఫామ్స్ అందజేయాల్సి ఉన్నది. కానీ అక్టోబర్ 30 నాటికి పంపిణీ చేసిన యూనిఫామ్స్ 49.63 లక్షలు మాత్రమే. ఇంకా స్టిచింగ్ కూడా మొదలుకానివి దాదాపు 1.61 లక్షల యూనిఫామ్స్ ఉన్నాయి.
సీఎం చేతుల్లోనే విద్యాశాఖ
విద్యాశాఖను ప్రణాళికాబద్ధంగా, ఆదర్శంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎవరికీ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లోనూ ఆయన చెప్పారు. కానీ విద్యాశాఖను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫామ్లే (School Uniforms) అందలేదు. కొందరికి ఒక జత అందితే, మరికొందరికి అసలే అందలేదన్నది ఉపాధ్యాయులు, పేరెంట్స్ వాదన.
సంక్షేమ శాఖల తరఫున విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలపై సీఎం సమీక్షించినప్పుడు అధికారులు వివరణ ఇవ్వడం, ఆ తర్వాత షరా మామూలు కావడం.. రొటీన్ ప్రాక్టీస్‌గా మారింది. యూనిఫామ్‌ల పంపిణీ ఏయే విద్యా సంస్థల్లో ఎంత శాతం పూర్తయిందో సంక్షేమ శాఖ రిపోర్టు తెప్పించుకున్నది. ఇందులో అక్టోబర్ 30 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. ఇంటర్ బోర్డు విద్యాసంస్థల్లో 50% టార్గెట్ మాత్రమే పూర్తయింది. ఉర్దూ రెసిడెన్షియల్ స్కూళ్లలో 67%, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 72%, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 75% చొప్పున పంపిణీ పూర్తయినట్లు తేలింది.
స్టిచింగ్ పూర్తయినా పెండింగ్
కొన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు జతల చొప్పున యూనిఫామ్స్ కుట్టినా పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో మొత్తం 17,34,870 మంది విద్యార్థులకు 34,69,740 యూనిఫామ్స్ కుట్టాల్సి ఉంది. కాగా వీళ్ల కోసం 34,84,616 యూనిఫామ్స్ స్టిచింగ్ కంప్లీట్ అయింది. అంటే అవసరానికి మించి 14,876 ఎక్కువే రెడీగా ఉన్నాయి. కానీ 1,08,937 యూనిఫామ్స్ ఇంకా విద్యార్థులకు అందలేదు. మరికొన్ని స్కూళ్లలో ఇప్పటి వరకు స్టిచింగ్ పనులు కూడా మొదలుకాలేదు.
మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 1,80,250 యూనిఫామ్స్ రెడీ చేయాల్సి ఉండగా.. 1,23,622 మాత్రమే పంపిణీ అయ్యాయి. ఇంకా 45 వేల డ్రెస్‌ల కుట్టు పనులే మొదలుకాలేదు. మోడల్ స్కూల్ విద్యార్థులకు సైతం 1,89,264 యూనిఫామ్‌లలో 1,57,791 మాత్రమే అందాయి. 25,341 యూనిఫామ్‌ల కుట్టు పనులు ప్రారంభమే కాలేదు. మొత్తం 13 రకాల విద్యా సంస్థల్లో 1,60,531 యూనిఫామ్‌ల స్టిచింగ్ మొదలుకావాల్సి ఉన్నది. పంపిణీ కావాల్సిన యూనిఫామ్‌లు 3,67,197 కాగా.. ఇందులో కుట్టు పనులు మొదలుకానివే 1,60,531 ఉన్నాయి.
ఇప్పటి వరకు పంపిణీ ఇలా..
సంస్థ పేరు విద్యార్థుల సంఖ్య అవసరమైన యూనిఫామ్స్ అందినవి పెండింగ్
ఏకలవ్య పాఠశాలలు 6,754 13,508 – 13,508
ఇంటర్మీడియెట్ విద్యామండలి 1,16,168 2,32,336 92,467 1,39,869
ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు 2,196 4,392 2,851 1,541
టీజీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 19,243 38,486 26,217 12,269
టీజీ మైనారిటీ గురుకుల సొసైటీ 90,125 1,80,250 1,23,622 56,628
మోడల్ పాఠశాలలు 94,632 1,89,264 1,57,791 31,473
టీజీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ 1,52,244 3,04,488 2,91,395 13,093
పాఠశాల విద్యాశాఖ 17,34,870 34,69,740 33,60,803 1,08,937
ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ 1,53,088 3,06,176 3,05,682 494
గిరిజన సంక్షేమ శాఖ (ఆశ్రమ పాఠశాలలు) 74,107 1,48,214 1,45,600 2,614

