జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు.. ప్రజలకు ఎస్పీ కీలక హెచ్చరిక!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయా మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు.

​ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటేందుకు లేదా ఆ మార్గాల్లో ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ​అలాగే పశువుల కాపరులు మూగజీవాలను వాగులు, నదుల సమీప ప్రాంతాలకు తీసుకెళ్లరాదని, ప్రవాహాలను దాటించే సాహసం చేయవద్దని స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాలు, చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ​ప్రజల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలని, అధికారిక హెచ్చరికలను విధిగా పాటించాలని జిల్లా ఎస్పీ (SP Rohith Raju) కోరారు.

Also Read : కాంట్రవర్సీ కాంగ్రెస్.. నేతల లొల్లితో పీసీసీకి తలనొప్పి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>