కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) చెందిన పార్కు స్థలాలను (TGIIC Park Land) కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. కోట్లాది విలువచేసే భూములను మాయం చేస్తున్నారు. టీజీఐఐసీ అభ్యంతరాలను లెక్కచేయకుండా, ఒక ఫార్మా కంపెనీ పార్కు భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించడం పారిశ్రామికవర్గాల్లో చర్చనీయంగా మారింది.
పారిశ్రామికవాడలో పార్కు కోసం టీజీఐఐసీ సుమారు 10 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, పార్కుకు దగ్గరగా గ్రావిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థ టీజీఐఐసీ స్థలంలో కాకుండా పక్కనే ప్రైవేటు స్థలంలో కంపెనీ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి మరొక కంపెనీలోకి వెళ్లేందుకు పార్కు భూమిలో దాదాపు అర ఎకరం స్థలాన్ని కబ్జా చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చదును చేసి, ఏకంగా సీసీ రోడ్డు నిర్మించింది. ఆ భూమి విలు రూ. 6 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చు. పరిశ్రమల ఉమ్మడి ప్రయోజనాలకు కేటాయించిన పార్కు భూములను ఆక్రమించి రోడ్డును నిర్మించడం వివాస్పదంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం
గ్రావిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థ కబ్జాపై స్థానికులు టీజీఐఐసీ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే.. రోడ్డు వేసే వరకు నిర్లక్ష్యం వహించిన అధికారులు, తర్వాత మేల్కొని రోడ్డు వేయడాన్ని అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణం ప్రాంతంలో ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. కంపెనీ యాజమానుల ఫెన్సింగ్‌ను తొలగించి, రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారులు అభ్యంతరం చెప్పినా దర్జాగా రోడ్డు నిర్మాణం చేయడంపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జా చేసిన స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి సదరు కంపెనీ యాజమాన్యం టీజీఐఐసీ అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
స్థానిక ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
పార్కు స్థలం (TGIIC Park Land) కబ్జాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పార్కు స్థలాన్ని ఆక్రమించిన గ్రావిటీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఇస్నాపూర్ మున్సిపాలిటికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ పాండు, టీజీఐఐసీ జోనల్ కమిషనర్ విఠల్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిబంధనలను ఉల్లంఘించిన సదరు కంపెనీకి ప్రభుత్వ తరఫున మౌలిక వసతులు కల్పించవద్దని, బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. టీజీఐఐసీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా భవిష్యత్ అవసరాల కోసం రూ. కోట్ల విలువైన పార్కు స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.

