కలం, ఖమ్మం బ్యూరో: ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ యువకులకు టూ వీలర్స్ ఇస్తే.. సదరు మైనర్లతో పాటు వారి తండ్రి, వాహన యజమానులపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ (Khammam Police) ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, రాత్రి 10 గంటల తర్వాత పిల్లలకు బైక్‌లు ఇచ్చి బయటకు పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చదువుకునే వయసులో యువత అర్ధరాత్రి హంగామాలు చేస్తూ కేసుల్లో ఇరుక్కుంటే.. భవిష్యత్తులో ఎలాంటి ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా జీవితాలు పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజుల పేరిట, పార్టీలు చేసుకుంటూ అర్ధరాత్రి సమయాల్లో నగరంలో తాగి రోడ్లపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఐపీఎల్ ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న ఆనందంలో గత రాత్రి ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో హద్దుమీరి ప్రవర్తించిన ఏడుగురు యువకులపై సిటీ పోలీస్ పబ్లిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. సదరు యువకులు రోడ్లపైకి వచ్చి మోటార్ సైకిళ్లపై త్రిబుల్ రైడింగ్, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ, సైలెన్సర్ల మోతతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగించారన్నారు. అంతేకాకుండా టపాసులు కాలుస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసినందుకు గానూ వారి వద్ద నుంచి ఐదు మోటార్ సైకిళ్లను సీజ్ చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ హంగామాలో పాల్గొన్న మరికొంతమంది యువకులను కూడా గుర్తించి త్వరలోనే కేసులు నమోదు చేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.

