కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన అర్జిదారుల దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్తానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జిదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అర్జిదారులకు భరోసా ఇచ్చారు.
ప్రతి దరఖాస్తును పరిశీలిస్తున్నాం
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం జిల్లా సంక్షేమం, భూ సర్వే రికార్డులు, రోడ్డు రవాణా, పోలీస్, విద్య, వైద్యం, విద్యుత్, జిల్లా సహకార శాఖ, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 148 వినతులను అధికారులు ప్రజావాణిలో స్వీకరించారు.
జూన్ 2న అవతరణ వేడుకలు
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించే అవతరణ వేడుకల కార్యక్రమానికి ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. ఉదయం 7.15 గంటలకు మంత్రి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించిన అనంతరం జిల్లా సమీకృత కార్యాలయంలో ఉదయం 7.50 గంటలకు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 8.00 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. ఉదయం 8.05 గంటలకు తెలంగాణ గీతాలాపన, 8.10 గంటలకు మంత్రివర్యుల సందేశం, 8.45 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, 9.15 గంటలకు స్టాళ్ల సందర్శన ఉంటుందని, కలెక్టర్ అన్నారు.
ప్రజావాణి పోర్టల్ నిర్వహణపై సమీక్ష
స్థానికసంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రజావాణి పోర్టల్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నీటిపారుదల శాఖ, గనులు భూగర్భశాఖ, దేవరకద్ర మున్సిపాలిటీ అధికారులు ప్రజావాణి పోర్టల్‌లో లాగిన్ చేయలేదని గుర్తు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే పోర్టల్‌లో లాగిన్ అయి ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశించారు.
రెడ్ క్రాస్ సొసైటీపై కూడా..
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. అధికారుల నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని.. దాన్ని వేగవంతం చేయాలని జిల్లా ఉపాధి అధికారికి ఆదేశించారు. జిల్లా ఉపాధి అధికారి అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అల్లం నిర్మల, జెడ్పీ సీఈవో ఇంచార్జి డీపీవో వెంకటరెడ్డి, డీఆర్‌డీవో నరసింహులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

