సైబర్ నేరగాళ్లపై ఖమ్మం పోలీసుల ఉక్కుపాదం.. వరుస అరెస్టులు!

కలం, ఖమ్మం బ్యూరో: సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో.. సైబర్ నేరగాళ్లు అంతే చాకచక్యంగా అమాయకులను ముంచేస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఓటీపీలు, లింకులతో చిన్న మొత్తాల్లో జరిగిన మోసాలు.. ఇప్పుడు ఏకంగా ‘ఇన్వెస్ట్‌మెంట్’, ‘క్రిప్టో ట్రేడింగ్’ పేరిట వందల కోట్ల రూపాయల వ్యవస్థీకృత దోపిడీగా రూపాంతరం చెందాయి. ఖమ్మం జిల్లాలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెలుగుచూసిన వరుస భారీ కుంభకోణాలు సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మరోవైపు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు (Khammam Police) ఈ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాల ఆటకట్టించేందుకు తీసుకుంటున్న కఠిన చర్యలు నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయనే చెప్పొచ్చు.

ఏప్రిల్ 29వ తేదీన వెలుగులోకి వచ్చిన, రూ.549కోట్ల అంతర్జాతీయ సైబర్ క్రైమ్, ఖమ్మం కేంద్రంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ముఠాలోని ప్రధాన సూత్రధారి సహా 10 మంది నిందితులపై ఖమ్మం పోలీసులు సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశారు. నిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నప్పటికీ.. ఈ సస్పెక్ట్ షీట్ ద్వారా వారి ప్రతి ఫోన్ కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు నిరంతర నిఘా ఉంచడంతో పాటు, వారు ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కొత్త వ్యాపారం ప్రారంభించినా పోలీసుల నిఘా నేత్రం వారిని వెంటాడుతుంది.

కేవలం భారీ కుంభకోణాలే కాకుండా, వ్యక్తిగతంగా లక్షల రూపాయలు నష్టపోతున్న బాధితుల కేసుల్లోనూ ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు (Khammam Police) తక్షణమే స్పందిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఉద్యోగికి క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నకిలీ యాప్స్ ద్వారా వల విసిరి విడతల వారీగా రూ. 18 లక్షలు కాజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి బ్యాంక్ ఖాతాను ట్రేస్ చేసిన పోలీసులు.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెరుపు దాడి చేసి సింగం శెట్టి సురేష్ అనే 32 ఏళ్ల అకౌంట్ హోల్డర్‌ను మే 16వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగినికి యూట్యూబ్ యాడ్స్ ద్వారా వాట్సప్ గ్రూపుల్లో పరిచయమై, అధిక లాభాల ఆశచూపి రూ. 13 లక్షలు మోసం చేశారు. ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కడలి చంద్రశేఖర్ అనే 23 ఏళ్ల అకౌంట్ హోల్డర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మొత్తంగా టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు ఎంతగా అప్డేట్ అవుతున్నారో.. ఖమ్మం పోలీసులు అంతకంటే పటిష్టమైన నిఘా వ్యవస్థతో, ‘సస్పెక్ట్ షీట్’ల వంటి కఠిన అస్త్రాలతో వారిని అణచివేస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందిస్తూ, వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

Read Also: పోలీసుల దురుసు ప్రవర్తన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>