కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ముగ్గురు మంత్రులకు సవాల్ గా మారాయి. ఫిబ్రవరి రెండో వారంలో జరిగే ఈ ఎన్నికలను ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. శుక్రవారం నామినేషన్ గడువు ముగిసిన వెంటనే శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచార పర్వం మొదలుపెట్టారు. ఉదయం ఎదులాపురం మున్సిపాలిటీలోనీ పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కాగా రేపు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎదులాపురంలో పర్యటించనున్నారు.
మంత్రి పొంగులేటి తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీలోని అన్ని స్థానాలు గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సభను ఎదులాపురం మున్సిపాలిటీలోనీ మద్దులపల్లిలో నిర్వహించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేసేశారు. ఇదే మీటింగ్ లో సీఎం రేవంత్ టీడీపీ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ కు మళ్లించేల వ్యూహాత్మకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఎదులాపురం మున్సిపాలిటీనీ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పదే పదే చెబుతున్నారు.
ఖమ్మం (Khammam) జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలలో కలిపి టీడీపీ 13 స్థానాల్లో మాత్రమే పోటీచేస్తోంది. వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో అసలు పోటీ కూడా చేయడం లేదు. ఎదులాపురంలో రెండు, సత్తుపల్లిలో రెండు, మధిరలో తొమ్మిది స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీ పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కు టీడీపీ అభిమానులు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో పక్క ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీపై గట్టిగానే ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఇటీవల రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నేతలతో రెండు రోజులు సమావేశం నిర్వహించి వారిని సన్నద్ధం చేశారు.
ఇంకో పక్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మద్దతు దారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అప్పట్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ మూడొంతుల మందిని కాంగ్రెస్ గెలిపించుకోవడం జరిగింది. ప్రస్తుత ఎన్నికలు గుర్తుల మీద జరగనుండటంతో మంత్రులు వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్తగూడెంను కాంగ్రెస్ లైట్ తీసుకుందా..?
కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ తో పొత్తు కూడా కుదరక పోవడంతో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీపీఐ రెడీ అవుతోంది. అయితే నామినేషన్ ఉపసంహరణ లోపు పొత్తులు కుదిరే అవకాశాలు కూడా లేకపోలేదు. మరో పక్క భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించట్లేదు. ఖమ్మం జిల్లా తో పోలిస్తే కొత్తగూడెం జిల్లాను కాంగ్రెస్ అంత సీరియస్ గా తీసుకోలేదా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. మంత్రుల పర్యటనలు కూడా కొత్తగూడెం జిల్లాలో పెద్దగా లేవు. ఖమ్మం జిల్లాతో పోలిస్తే మున్సిపాలిటీలు కూడా కొత్తగూడెంలో తక్కువే. అశ్వరావు పేటలో తుమ్మల వర్గం, పొంగులేటి వర్గం మధ్య వర్గ పోరు ఉంది. మరి ఎవరు ఎక్కువ స్థానాలు సాధిస్తారో చూడాలి.


