కలం, ఖమ్మం బ్యూరో: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో అమాయకుల నుంచి లక్షలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం పోలీసులు ఆటకట్టించారు. వాట్సాప్ లింకులతో వల విసిరి ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.18 లక్షలు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక విషయాలను మీడియా వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగికి కొద్దిరోజుల క్రితం వాట్సప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ ట్రేడింగ్ (Online Trading Scam), క్రిప్టోలో డబ్బులు పెడితే, ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. అనంతరం వాట్సాప్ లింకులు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లను పంపారు. దీంతో ఉద్యోగి విడతలవారీగా రూ. 18 లక్షలు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేశాడు.
ఆ తర్వాత ఎన్ని రోజులు గడిచినా లాభాలు రాలేదు. పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తీసుకోలేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. చివరకు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. బ్యాంక్ ఖాతాదారుడి వివరాలను సేకరించారు. నిందితుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. సైబర్ నేరాల్లో నిందితుడిగా ఉన్న సింగంశెట్టి సురేశ్ (32)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఖమ్మం తరలించి సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సీపీ సునీల్ దత్ అభినందించారు.

