Mobile Popup Ad
Mobile Popup Ad

పోక్సో, గంజాయి కేసుల్లో రికార్డు శిక్షలు.. ఏపీపీకి సీపీ అభినందనలు

కలం, ఖమ్మం బ్యూరో: చిన్నారులపై లైంగిక వేధింపుల (పోక్సో) కేసులు, గంజాయి వంటి తీవ్రమైన ఎన్‌డీపీఎస్ కేసుల్లో కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించి, నేరస్థులకు (Child Abuse Convicts) రికార్డు స్థాయిలో శిక్షలు పడేలా చేసిన ఖమ్మం కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏపీపీ శరత్ కుమార్ రెడ్డిని సీపీ ఘనంగా సత్కరించారు.

పోలీస్, ప్రాసిక్యూషన్ విభాగాల సమన్వయంతో నేరస్థులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష మొదలుకొని అనేక కఠిన కారాగార శిక్షలు పడేలా చేయడంలో ఏపీపీ శరత్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా సీపీ కొనియాడారు. ఈ ఏడాది ఇప్పటికే ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్ గట్టిగా వాదించింది.

ఇందులో ఖమ్మం అర్బన్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రఘునాథపాలెం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష, ఖమ్మం రూరల్ పరిధిలోని రెండు వేర్వేరు కేసుల్లో ఏడేళ్లు, ఐదేళ్ల జైలు శిక్షలతో పాటు, మరో రఘునాథపాలెం కేసులో మూడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష ఖరారయ్యింది. అదేవిధంగా సమాజానికి పెను ముప్పుగా మారిన గంజాయి వంటి తీవ్రమైన 10 ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో ఏపీపీ ప్రతిభ కనబరిచారు.

కోర్టు ముందు బలమైన ఆధారాలు ఉంచడంతో ఆరు కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు, ఒక కేసులో ఏడేళ్ల జైలు, రెండు కేసుల్లో ఏడాది పాటు జైలు శిక్షలు పడ్డాయి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, బాధితులకు త్వరితగతిన న్యాయం జరగడానికి ఇన్వెస్టిగేషన్ అధికారుల శ్రమ, ప్రాసిక్యూషన్ ప్రతిభ ఎంతో అవసరమని, భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో పనిచేయాలని సీపీ సునీల్ దత్ ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>