Mobile Popup Ad
Mobile Popup Ad

లేటుగా వస్తే ‘జీతంలో కోతే’.. కలెక్టర్ అంకిత్ సీరియస్!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించని ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ అంకిత్ (Khammam Collector Ankith) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఐడీఓసీ సముదాయంలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ తనిఖీల్లో కలెక్టర్ స్వయంగా ప్రతి విభాగాన్ని పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించి, సిబ్బంది హాజరు, వారు విధులను నిర్వహిస్తున్న తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సుదీర్ఘంగా ఆరా తీశారు.

​తనిఖీల్లో భాగంగా కలెక్టర్ ప్రతి కార్యాలయంలోని సీట్ల వద్దకు వెళ్లి, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం గమనించిన కలెక్టర్, సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు ఎందుకు విధులకు హాజరుకాలేదని అధికారులను నిలదీశారు. సరైన కారణం లేకుండా ఆలస్యంగా కార్యాలయానికి వస్తున్న సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ, అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు ఈరోజు జీతంలో కోత విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అంకిత్ (Collector Ankith), ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు హాజరైన ప్రతి ఉద్యోగి హాజరు రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రాకపోవడం లేదా హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు. ప్రతి శాఖలో అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించేందుకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: ఈవీల క్రేజ్.. ప్రభుత్వ ఆదాయానికి బ్రేక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>