కలం, ఖమ్మం బ్యూరో: యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ (Khammam ACP) రమణమూర్తి (Ramana murthy) పిలుపునిచ్చారు. నగరంలోని స్టెమ్ పార్క్ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉందని, వారిపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం పడకుండా కాపాడుకోవడం మన అందరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. చెడు స్నేహాల వల్లనో, లేదా పరిస్థితుల ప్రభావం వల్లనో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలకు అలవాటుపడితే శారీరకంగా, మానసికంగా అనేక రుగ్మతల బారిన పడతారని ఆయన హెచ్చరించారు.
మాదకద్రవ్యాలను సేవించడం, సరఫరా చేయడం, తయారు చేయడం, అలాగే క్రయవిక్రయాలు సాగించడం చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ నేరాలని, ఈ చర్యలకు పాల్పడే వారికి చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారు వాటి నుంచి విముక్తి పొందడానికి స్వయంగా ముందుకు వస్తే, వారిపై ఎలాంటి నేర విచారణ ఉండదని ఏసీపీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
అలాంటి వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్య సహాయం అందించి, వారిని మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, స్టెమ్ పార్క్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

